Empress cruise to spread it's services to vishakha in Andhrapradesh from June విశాఖకు విదేశీ విహార నౌక (వీడియో)

                        విశాఖకు విదేశీ విహార నౌక 

                                Credit: Pixels

విశాఖపట్నం నగరానికి మరో సరికొత్త అవకాశం అందుబాటులోకి రానుంది. ఎంప్రెస్‌ అనే విదేశీ విహార నౌక.. విశాఖ సముద్ర తీరంలోనూ సేవలందించేందుకు సర్వం సిద్ధమైంది. జూన్ 8 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విదేశీ నౌక ప్రయాణీకులను తీసుకుని విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి విశాఖకు చేరుకుంటుంది. ఈ క్రూయిజ్ లో విహరించాలనుకునేవారు సర్వీసును బట్టి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. సుమారు 1500 నుంచి 1800 మంది వరకు ఒకేసారి ఈ నౌకలో ప్రయాణించడానికి వీలుంది. 

 ఎంప్రెస్ క్రూయిజ్ లో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రయాణీకులకు  కావాల్సిన ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈతకొలను, ఫిట్‌నెస్‌ కేంద్రం తదితర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల వినోదం కోసం పలు పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఐతే మద్యం, స్పా సర్వీసులు, కాసినో వంటి క్రీడల కోసం డబ్బు చెల్లించాలి.

 జూన్ 8వ తేదీన ఉదయం విశాఖకు తొలిసారి ఎంప్రెస్ క్రూయిజ్ ప్రయాణీకులతో రానుంది. ఆ  తర్వాత అదే రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరి 9వ తేదీ మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది. 10వ తేదీన ఉదయం 7 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. పుదుచ్చేరిలో రాత్రి 7 గంటల వరకు ప్రయాణీకులు పర్యటించవచ్చు. మళ్లీ పుదుచ్చేరిలో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు చెన్నైకు చేరుకుంటుంది. ఎంప్రెస్‌ విదేశీ విహార నౌక అయినప్పటికీ దీన్ని ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. కాబట్టి దీనికి పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. కస్టమ్స్‌ తనిఖీలు ఉండవు. ప్రస్తుతం విశాఖ నుంచి చెన్నై వరకు విహరించడానికి టిక్కెట్లు విక్రయిస్తున్నారు. 

  విశాఖ నౌకాశ్రయానికి గతంలో కూడా కొన్ని నౌకలు వచ్చినా ప్రస్తుతం వచ్చే నౌకకు కొన్ని ప్రత్యేకతలున్నాయంటున్నారు. ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం, ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం, మినీ సూట్‌ రూం, సూట్‌ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కో ధరను నిర్ణయించారు. అదే నౌక జూన్‌ 15న, 22వ తేదీన కూడా వస్తుంది.

 విశాఖ నగరానికి వచ్చేనెల 8వ తేదీన అతిపెద్ద క్రూయిజ్‌ వస్తోంది. నౌకాశ్రయంలోకి రావటానికి దానికి అనుమతులు ఇచ్చాం. ఇతరశాఖల అధికారులకు కూడా సమాచారం తెలియజేశాం. భారత సాగర తీరాల్లో మాత్రమే తిరిగే విహార నౌక కావడంతో అందులోని పర్యాటకులలో దాదాపు అందరూ భారతీయులే ఉంటారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదు.

-కె.రామమోహనరావు, ఛైర్మన్‌, విశాఖ నౌకాశ్రయం



Read Also:బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరి

Facebook


Post a Comment

Previous Post Next Post

Most Popular