గోళ్ల ద్వారా అనారోగ్యాన్ని పసిగట్టవచ్చా?
అనారోగ్యం లేదా వ్యాధుల బారిన పడ్డప్పుడు వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటాం. రకరకాల పరీక్షలు చేసిన తర్వాత ఒక్కోసారి దీర్ఘకాలిక వ్యాధులు బయటపడతాయి. కానీ అప్పటికే శరీరంలో వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. ఫలితంగా నయం చేయడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఐతే దీర్ఘకాలిక రోగాలను ముందస్తుగానే పసిగట్టినట్టయితే త్వరితగతంగా వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు మన శరీరమే కొన్ని ముందస్తు సంకేతాలు అందిస్తుంది. అందులో భాగంగా మన గోళ్లు కూడా రకరకాల అనారోగ్యాలకు వివిధ రకాలుగా ముందస్తు సంకేతాలు అందిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు, శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, కాపాడాల్సిన రోగ నిరోధక వ్యవస్థే శరీరంపై ప్రతిదాడి చేయడం.. ఇలాంటి కారణాల వల్ల మనం అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇవి దీర్ఘకాలిక రోగాలుగా బయటపడతాయి. వీటిని నయం చేసుకోవడం అంత సులభం కాదు. చాలా ఏళ్లు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి వస్తుంది. ఐతే ఈ దీర్ఘకాలిక రోగాలను ముందస్తుగా గుర్తించేందుకు మన శరీరమే సహకరిస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని ముందస్తు సంకేతాలు అందుతాయి. అలాంటి వాటిలో గోళ్లు కూడా ఒకటి. చేతులు, కాళ్ల వేళ్లకు రక్షణగా ఉండే గోళ్లు.. అనారోగ్యాలకు సంబంధించి మనకు ముందస్తు సంకేతాలను అందిస్తాయి. ఇది వివిధ రకాలుగా ఉంటుంది. అంటే గోళ్లు రంగు మారడం, పాలిపోయినట్లుగా కనిపించడం, చిట్లిపోవడం అన్నమాట. ఇలాంటి సంకేతాలను బట్టి శరీరంలో ఎలాంటి సమస్య రానుందో ముందస్తుగానే తెలుసుకోవచ్చు. సహజంగా గోళ్లు తెలుపు, కాస్త ఎరుపు రంగులో ఉంటాయి. కానీ గోళ్లు సహజంగా ఉండాల్సిన రంగులను కోల్పోయినప్పుడు రాబోయే అనారోగ్యాలకు సంబంధించి సంకేతంగా గుర్తించవచ్చు. ఉదాహరణకు గోళ్లు పాలిపోయినట్లుగా ఉన్నట్లయితే రక్తహీనత, హృద్రోగ సమస్యలు, కాలేయ సమస్యలు, పోషకాహార లోపం ఉందని అర్థం. అలాగే గోళ్లు తెల్ల రంగులో ఉండి ముదురు అంచులతో ఉన్నట్లయితే హెపటైటిస్ వంటి కాలేయ సమస్యలకు సంకేతంగా భావించాలి.
గోళ్ల తీరును బట్టి థైరాయిడ్ సమస్యను గుర్తించొచ్చా?
కొంత మందిలో ఉన్నట్టుండి గోళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. దీన్ని బట్టి శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించవచ్చు. శరీరంలో ఫంగస్ ఎక్కువైనప్పుడు గోళ్లు మందంగా తయారవడమే కాకుండా విరిగిపోవడాన్ని గమనించవచ్చు. అలాగే గోళ్లు పసుపు రంగులో ఉన్నట్లయితే థైరాయిడ్, ఊపిరితిత్తుల సమస్యలు, డయాబేటీస్, సోరియాసిస్ సమస్యలకు ముందస్తు సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. మరికొంత మందిలో గోళ్లు నీలం రంగులోకి మారుతుంటాయి. ఇలా నీలం రంగులోకి మారినట్లయితే వారికి ఆక్సిజన్ సరైన మోతాదులో అందడం లేదని అర్థం. ఎంఫిసెమా అనే ఊపిరితిత్తుల సమస్య, హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక మరికొంత మందిలో గోరు ఉపరితలం గుంట పడినట్లుగా ఉన్నట్లయితే అది సోరియాసిస్ కు ప్రారంభ సంకేతం కావచ్చు. అలాగే గోళ్లు పొడిబారడం లేదా పెళుసుగా మారి చిట్లిపోవడం గమనించినట్లయితే థైరాయిడ్ సమస్యగా గుర్తించాలి.
గోళ్లు చర్మ క్యాన్సర్ సంకేతాలిస్తాయా?
మరోవైపు గోర్లు మాత్రమే కాకుండా వాటి చుట్టూ చర్మం ఎర్రగా మారి ఉబ్బినట్లు కనిపిస్తుంది. దీన్ని గోరుచుట్టు అంటారు. కణజాల రుగ్మతలకు సంకేతంగా దీన్ని గుర్తించాలి. అంటే శరీరంలో ఇన్ఫెక్షన్ల కారణంగా ఇలా జరుగుతుంది. అలాగే గోళ్ల కింద సన్నటి గీతలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి చర్మ క్యాన్సర్లకు సంకేతం అన్నమాట. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇక మనలో చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇది చాలా సహజంగా కనిపిస్తుంది. ఐతే గోళ్లు కొరికే అలవాటు ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని మానసిక ఆందోళనకు సంకేతంగా గుర్తించాలి.
Read Also: బాదం ద్వారా ఎలాంటి పోషకాలు అందుతాయి?
గోళ్లు రంగు మారినా, సహజస్థితి కోల్పోయినా ఏదో అనారోగ్య ప్రమాదం రావచ్చని ముందస్తు సంకేతంగా భావించాలి. ఐతే అన్ని సార్లు దీన్ని పూర్తి ప్రామాణికంగా తీసుకోవడానికి వీలు లేదు. ముందస్తు సంకేతాన్ని బట్టి.. ఆయా వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. లేదా వైద్యులతో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించాలి.
Read Also:ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు?
ఈ స్టోరీ మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఉపయోగపడుతుందనుకుంటే కింద వాట్సప్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి.
నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.
Follow us on: Google News Twitter Koo