ఎలాంటి బ్రెడ్ కొనడం ఆరోగ్యానికి మంచిది?

                ఎలాంటి బ్రెడ్ కొనడం మంచిది? 


 పాశ్చాత్య ఆహారపు అలవాట్లు ఇప్పుడు భారత దేశంలోనూ చాలా మంది అనుసరిస్తున్నారు. బ్రెడ్ తీసుకోవడం అందులో ఒకటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం అల్పాహారంలో చాలా మంది బ్రెడ్ ను కూడా చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రెడ్ తినడం మంచిదేనా? అనే సందేహం చాలా మందికి వస్తోంది. ఒకవేళ బ్రెడ్ ను ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఎలాంటి బ్రెడ్ తీసుకోవాలి? బ్రెడ్ వల్ల ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలేంటి? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

 ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. ఐతే ఉరుకుల పరుగుల జీవితం కారణంగా చాలా మంది అల్పాహారం తీసుకోవడంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలని భావించే వారు..  త్వరగా చేయడం పూర్తయ్యే వంటి వాటిని తమ డైట్ లో చేర్చుకుంటున్నారు. అందులో బ్రెడ్ ఒకటి. బ్రెడ్ టోస్ట్ చేసుకోవడం లేదా బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవడంతో ఉదయం అల్పాహారాన్ని ముగించేస్తున్నారు. ఐతే ఉదయం పూట  బ్రెడ్ తీసుకునే వారు కొన్ని విషయాలపై అవగాహన ఏర్పరచుకోవడం మంచిది. ముఖ్యంగా బ్రెడ్ లో పిండి పదార్థం ఎక్కువగా, పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. ఇందులో సాధారణ వైట్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ ఎంచుకోవడం మంచిది. ఒకవేళ హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నట్లయితే ప్యాకేజీపై వాటి వివరాలు తప్పకుండా చదువుకోవాలి. గోధుమ, ఓట్స్, రాగి బ్రెడ్ తీసుకున్నప్పుడు.. వాటి ముందు హోల్ అని రాసి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలా కాకుండా మల్టీ గ్రెయిన్, స్టోన్ గ్రౌండ్, 100% వీట్, క్రాక్డ్ వీట్, సెవెన్ గ్రెయిన్ అని రాసి ఉన్నట్లయితే.. అది హోల్ గ్రెయిన్ బ్రెడ్ కాదని అర్థం. మరోవైపు బ్రెడ్ లో ఉప్పు శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో బ్రెడ్ తీసుకునే వారికి.. ఎక్కువ మొత్తంలో పిండి పదార్థాలతోపాటు ఉప్పు కూడా ఎక్కువగా అందుతుంది. ఒక బ్రెడ్ ముక్కలో దాదాపు 137 గ్రాముల వరకు ఉప్పు శాతం ఉంటుంది. మూడు పూటలా బ్రెడ్ తీసుకున్నట్లయితే శరీరంలో ఉప్పు శాతం పెరిగి అధిక రక్తపోటు, గుండె సమస్యలు, పక్షవాతం, మూత్ర పిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

బ్రెడ్ తింటే చక్కెర స్థాయి పెరుగుతుందా?

  బ్రెడ్ లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రెడ్ తీసుకున్న వెంటనే త్వరగా జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి త్వరగా పెరుగుతుంది. అంతే కాదు బ్రెడ్ తిన్న తర్వాత కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. పదే పదే ఎక్కువగా తిన్నట్లయితే ఊబకాయం  సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఐతే బ్రెడ్ లో హోల్ గ్రెయిన్స్ ఉండేలా చూసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి కాస్త బయట పడవచ్చు. తృణధాన్యాలు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచడమే కాకుండా హృద్రోగ సమస్యలు రాకుండా చేస్తాయి. అంతే కాదు తృణధాన్యాల్లో ఉండే పోషక పదార్థాలు శారీరక జీవక్రియలు మెరుగుపరిచి రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి.  

 బ్రెడ్ ను ఆహారంగా తీసుకునే వారు మరికొన్ని విషయాలు కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బ్రెడ్ ఎంపికలో, నిల్వ చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. మార్కెట్లో ఎన్ రిచ్ బ్రెడ్ అని చూడగానే చాలా మంది కొనుగోలు చేస్తారు. కానీ ఎన్ రిచ్ బ్రెడ్ బాగా శుద్ధి చేసిన ధాన్యాలతో తయారు చేస్తారు. కాబట్టి ఆ బ్రెడ్ బరువు తేలిగ్గాను, ఎక్కువ రోజులు మన్నికగానూ ఉంటుంది. కానీ ఇందులో పీచు పదార్థం ఉండదు. అలాగే ఇనుము ధాతు, విటమిన్ B వంటివి కూడా లోపిస్తాయి. కాబట్టి ఎన్ రిచ్ బ్రెడ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాగే బ్రెడ్ ను నిల్వ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఫ్రిడ్జ్ లో ఎప్పుడూ బ్రెడ్ పెట్టకూడదు.  బ్రెడ్ ప్యాకెట్ ను వీలైనంత వరకు బయట  వాతావరణంలోనే ఉంచాలి. సాధారణంగా బ్రెడ్ 2 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత అందులో ఫంగస్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఫంగస్ కనిపించిన బ్రెడ్ తినవద్దు. 

హోల్ గ్రెయిన్ బ్రెడ్ తో బరువు తగ్గుతారా?

 స్థూలకాయం ఉన్న వారు బరువు తగ్గేందుకు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తింటూ ఉంటారు. ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంచుతుందనేది వారి నమ్మకం. కానీ ఇలా కేవలం హోల్ గ్రెయిన్ బ్రెడ్  పైనే ఆధారపడడం మంచిది కాదు. అన్ని రకాల పోషక పదార్థాలు తీసుకుంటూ బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇక బ్రెడ్ నుంచి ఎక్కువ పీచు లభించాలనుకునే వారు డబుల్ ఫైబర్ బ్రెడ్ ఎంచుకోవచ్చు. ఇందులో ఒక్కో బ్రెడ్ ముక్క నుంచి 5 నుంచి 6 గ్రాముల వరకు పీచు పదార్థం లభిస్తుంది. 

గమనిక :ఈ కథనం మీ స్నేహితులకు, బంధువులకు ఉపయోగపడుతుందనుకుంటే వాట్సప్ లింక్ ద్వారా షేర్ చేయండి.

See Also: T Hub 2.0 లోపల ఎలా ఉందో చూశారా?

నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.

Follow us on: Google News  Twitter


Post a Comment

Previous Post Next Post