రోజూ బాదం తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
రోజువారీ తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష. తాజా పండ్లు, తాజా కూరగాయలు ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది బాదం పప్పు. దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో అసలు రోజూ బాదం తింటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజూ బాదం తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు.
* విటమిన్ E, క్యాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, మాంగనీస్, రాగితోపాటు శరీరానికి మేలు చేసే కొవ్వులు పీచు పదార్థాలు లభిస్తాయి.
* బాదం పప్పులో శరీరానికి కావాల్సిన నాలుగో వంతు క్యాల్షియం లభిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.
* రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలోనూ బాదం పప్పు సహాయపడుతుంది.
* డయాబేటీస్ రోగుల్లో మెగ్నీషియం లోపాన్ని సరిదిద్దేందుకు బాదం పప్పు ఉపయోగపడుతుంది.
* బాదం పప్పులో పాస్పరస్ శాతం అధికంగా ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
* బాదం పప్పు నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే లిపేజ్ అనే ఎంజైమ్ శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది.
* బాదం పప్పు నేరుగా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల శరీరానికి పోషకాలు వేగంగా అందుతాయి. ప్రతి రోజూ పెద్దలు 8 నుంచి 10 వరకు బాదం పప్పులను తీసుకోవచ్చు. అలాగే పిల్లలు నాలుగు నుంచి ఆరు వరకు బాదం పప్పులు తినడం మంచిది.
* చివరగా.. బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదని అతిగా తినడం కూడా మంచిది కాదు. ఇందువల్ల కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి.
* బాదంపప్పు అతిగా తింటే శరీరంలో కొవ్వులు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది.
Read Also: మొబైల్ లో స్పేస్ రన్నింగ్ ప్రాబ్లమ్ సరి చేయడం ఎలా