బ్రంచ్ అంటే ఏంటి ? ఆరోగ్యానికి ఏది మంచిది?
మంచి పోషకాలతో నిండిన ఆహారం తీసుకున్నప్పుడే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది పని ఒత్తిడి లేదా సమయాభావం కారణంగా ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం లేదు. మధ్యాహ్న భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. ఫలితంగా ఊబకాయం సహా ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐతే ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనాన్ని కలిపి ఒకేసారి తీసుకునే విధంగా బ్రంచ్ అనే కొత్త ప్రక్రియ పుట్టుకొచ్చింది. అసలు ఈ బ్రంచ్ అంటే ఏమిటి ?బ్రంచ్ లో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రంచ్.. ఈ పదం పల్లెల్లో వినడానికి కొత్తగా ఉన్నా.. పట్టణాల్లో పరిచయమైన పదమే. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం కలగలిపి సృష్టించినదే బ్రంచ్. సాధారణంగా చెప్పాలంటే బ్రేక్ ఫాస్ట్, లంచ్ ల మేలు కలయికే బ్రంచ్. ఉదయం పూట తీసుకునే అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఒకేసారి తీసుకోవడాన్నే బ్రంచ్ గా చెప్పుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు తినడానికి సరైన సమయం లేని వారు ఈ బ్రంచ్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఒకేసారి అల్పాహారం, మధ్యాహ్న భోజనం పూర్తయి సమయం కలిసి వస్తుందనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ బ్రంచ్ లను రకరకాలుగా తయారు చేస్తారు. ఐతే వీటిలో ఉత్తమమైనవి ఉన్నాయి.. అలాగే శరీరానికి అధిక కేలరీలు అందించేవి కూడా ఉన్నాయి. వాటిలో ఉత్తమమైనవి ఎంచుకోవడం మంచిది.
బ్రంచ్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుందా?
బ్రంచ్ లో చాలా మంది ఇష్టపడేది.. తేలిగ్గా చేసుకునేది ఆమ్లెట్. దీని నుంచి సరైన మోతాదులో ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఆమ్లెట్ చేసేటప్పుడు పాలకూర, పుట్టగొడుగులు, టమోటా వంటి వాటిని కలుపుకోవడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఐతే కొడి గుడ్డు మాత్రమే ఎక్కువగా ఉపయోగించకుండా చూసుకోవాలి. లేదంటే కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అలాగే చీజ్, డెలీ మీట్స్ వంటి వాటిని ఉపయోగించకుండా ఆమ్లెట్ చేసుకుంటే మంచిది. ఇక బ్రంచ్ లో ఓట్ మీల్ తయారు చేసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండి.. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీన్ని బ్రంచ్ లో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఐతే ఓట్ మీల్ తయారీలో వెన్న లేదా చక్కెరకు దూరంగా ఉండి నట్స్ లేదా తాజా పండ్లు ఉపయోగించడం మంచిది. ఇక మాంసాహారులు బ్రంచ్ లో భాగంగా ష్రింప్ అండ్ గ్రిట్స్ కూడా తీసుకోవచ్చు. దీనిలో రొయ్యలు వాడడం వల్ల మంచి ప్రోటీన్ తోపాటు క్యాల్షియం, ఇనుముధాతు పుష్కలంగా లభిస్తుంది. పైగా దీనిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అటు కప్ గ్రిట్స్ ద్వారా కూడా కేవలం 140 కేలరీలు మాత్రమే అందుతాయి. ఐతే దీన్ని తయారు చేసేటప్పుడు చీజ్ లేదా చికెన్ బ్రాత్ ఉపయోగించకుండా ఉండడం మంచిది. అలాగే బ్రంచ్ లో బాగెల్ అండ్ లాక్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రోటీన్ తోపాటు ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఆమ్లెట్ లాంటి బ్రంచ్ రెసిపీ ఫ్రిటాట. ఇది కూడా నూనె తక్కువగా వేసుకుని చేసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.
ఎక్కువ కేలరీలతో కూడిన బ్రంచ్ లు ఏవి?
మరోవైపు బ్రంచ్ లో తీసుకోకూడని కొన్ని డిష్ లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఫ్రెంచ్ టోస్ట్. తినడానికి ఇది రుచికరంగా ఉన్నప్పటకీ అధిక కేలరీలు అందించే డిష్. పైగా దీని తయారీలో మ్యాపుల్ సిరప్, బ్రౌన్ షుగర్ వాడకం వల్ల శరీరానికి అదనపు కేలరీలు అందుతాయి. అలాగే ఎగ్స్ బెనెడిక్ట్, కాబ్ సలాడ్, అల్కహాలిక్ బేవరేజెస్, బర్గర్, ప్యాన్ కేక్స్, హోమ్ ఫ్రైస్, ట్యూనా మిల్లెట్ వంటి డిష్ ల ద్వారా కూడా ఎక్కువ కేలరీలు అందుతాయి. పైగా వీటిలో పీచు పదార్థం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రంచ్ లో వీలైనంత వరకు వీటిని చేసుకోకుండా ఉండడమే మంచిది.
Read Also: ఛాతీనొప్పి..గుండెపోటు ఒకటేనా?
ఎలాంటి బ్రంచ్ ఎంచుకోవడం మంచిది?
బ్రంచ్ అంటే రెండు పూటలకు సంబంధించిన ఆహారం ఒకేసారి తీసుకుంటారు కాబట్టి.. వీలైనంత వరకు మంచి పోషకాలతో కూడిన దానినే ఎంచుకోవాలి. ముఖ్యంగా బలవర్ధకమైన మాంసకృత్తులు, పప్పులతో చేసిన పదార్ధాలు, పీచు ఎక్కువగా ఉండేవి తీసుకోవడం మంచిది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే వాటిని ఎంచుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. పొట్టుతీయని ధాన్యాలు, కొవ్వు తీసిన పాలు, గుడ్లు, పండ్ల వంటివి ఉండేలా చూసుకోవడం మేలు చేస్తుంది.
Read Also: టమాటోతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేవి?