ఛాతీ నొప్పి.. గుండెపోటు రెండూ ఒకటేనా?

            ఛాతీ నొప్పి.. గుండెపోటు రెండూ ఒకటేనా?


 ఛాతీ నొప్పి.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్య సమస్య. ఇది మనిషిని అతలాకుతలం చేస్తుంది. ఒక్కసారిగా  ఛాతీ అంతా బిగుసుకున్నట్లుగా అనిపించడం, శ్వాస ఆడకపోవడం, గుండె వేగం పెరగడం, ఒళ్లంతా చెమటలు పట్టడం జరుగుతుంది.  నిజానికి ఛాతీ నొప్పిని చాలా మంది గుండె పోటుగానే భావిస్తారు. ఐతే ఛాతీ నొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. అంతే కాదు ఛాతీ నొప్పిని ఎట్టి  పరిస్థితుల్లో అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. అసలు ఛాతీ నొప్పికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. . . 

 ఛాతీలో నొప్పి రాగానే చాలా మంది గుండె నొప్పి అని భావిస్తారు. నిజానికి చాలా వరకు గుండె సమస్యలకు సంబంధం ఉంటుంది.  కానీ అన్ని వేళలా అవి మాత్రమే కారణం కాకపోవచ్చు. ఎందుకంటే ఛాతీలో నొప్పి రావడానికి ఊపిరితిత్తులు, అన్నవాహిక, కండరాలు, పక్కటెముకలు, నరాల్లోనూ సమస్యలు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఛాతీ నొప్పిని అశ్రద్ధ చేయకుండా నిర్దిష్టమైన కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా తగిన విధంగా చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది. 

గుండెకు సంబంధించిన కారణాలను చూస్తే వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది కరోనరీ ఆర్టరీ డిసీస్..CAD అని వ్యవహరిస్తారు.  గుండె కండరాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా కాకుండా ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. దీన్నే ఆంజినా నొప్పిగా కూడా పిలుస్తారు. భవిష్యత్తులో హార్ట్ ఎటాక్ రానుంది అనడానికి దీన్ని సంకేతంగా గుర్తిస్తారు. ఈ సమస్య వచ్చినప్పుడు ఛాతీలో వచ్చే నొప్పి క్రమంగా భుజాలు, చేతులు, దవడలు, వెన్నెముక వరకు వ్యాపిస్తాయి. అలాగే మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, మయోకార్డిటిస్, పెరికార్డిటిస్, హైపర్ ట్రోఫిక్ కార్డియో మయోపతి వంటి గుండె సమస్యల వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుంది. ఈ సమస్యల వల్ల ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు గుండెల్లో మంటగా ఉండడం, అలసట, మగతగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన గుండె సమస్యల వల్ల ఛాతీలో  నొప్పి వచ్చినప్పుడు తీవ్రంగా పరిగణించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

 ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల వల్ల  కూడా ఛాతీలో నొప్పి  వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసినవి న్యూమోనియా, పల్మినరీ ఎంబోలిజమ్, న్యూమోత్రాక్స్, పల్మినరీ హైపర్ టెన్షన్, ఆస్తమా. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల న్యూమోనియా వస్తుంది. జ్వరం, దగ్గుతోపాటు ఛాతీలో నొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఇక ఆస్తమా అంటే ఉబ్బసం వ్యాధి ఉన్న వారిలోనూ ఛాతీ నొప్పి సమస్య కనిపిస్తుంది. శ్వాసకోశ నాళాల్లో  సమస్యల కారణంగా ఊపిరి  అందకపోవడం, దగ్గుతోపాటు ఛాతీ నొప్పి కూడా వస్తుంది. అటు పొగ తాగే వారిలోనూ సాధారణంగా ఛాతీ నొప్పి కనిపిస్తుంది. ఐతే వారిలో క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మినరి డిసీస్.. COPD ద్వారా ఈ సమస్య వస్తుంది. చిన్నగా మొదలయ్యే ఈ సమస్య క్రమంగా  దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. శ్వాస తీసుకోలేకపోవడం, విపరీతమైన దగ్గుతో బాధపెడుతుంది. స్మోకింగ్ అలవాటు ఈ సమస్యకు ప్రధాన కారణం.

టెన్షన్ పెరిగితే ఛాతీలో నొప్పి వస్తుందా?

 అన్న వాహికలో సమస్యలు ఏర్పడడం కూడా ఛాతీ నొప్పికి దారి తీస్తుంది. ఒక్కోసారి కడుపులోని ఆమ్లాలు గొంతు వరకు ఎగిసిపడుతుంటాయి. ఈ కారణంగా నోటిలో, గొంతులో మంటగా ఉంటుంది. అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి కూడా వస్తుంది. దీన్నే గ్యాస్ట్రోఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసీస్.. GERD అని వ్యవహరిస్తారు. ఇదే కాకుండా పెప్టిక్ అల్సర్స్, హైటల్ హెర్నియా  వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఈ సమస్యలు పొగ తాగే వారు, మద్యం సేవించే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పక్కటెముకలకు గాయాలైనప్పుడు లేదా విరిగినప్పుడు కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. అంతేకాదు ఆందోళన కలిగించే వార్తలు విన్నప్పుడు ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయి శ్వాస ఆడడం కష్టమవుతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ సమయంలోనూ ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. 

Read Also: గోళ్ల ద్వారా అనారోగ్యాన్ని పసిగట్టవచ్చా?

 ఛాతీలో నొప్పి రాగానే కంగారు పడవద్దు. భయాందోళన చెందినట్లయితే .. సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. గుండె వేగం పెరిగి.. ప్రాణాపాయం కూడా కావచ్చు. కాబట్టి ఛాతీ నొప్పి  రావడానికి కారణం తెలుసుకుంటే సమస్యను సులువుగా అధిగమించవచ్చు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల ద్వారా వచ్చే ఛాతీ నొప్పిని నివారించుకోవడానికి రోజూ క్రమం తప్పకుండా బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకుంటే అన్నవాహిక సమస్యల ద్వారా వచ్చే ఛాతీ నొప్పిని నివారించుకోవచ్చు.

Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

Video: 'అరబిక్ కుత్తు' పాటను అచ్చం అలాగే దింపేసిన ఫ్యాన్స్

నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.

ఈ కథనం మీ స్నేహితులు, బంధువులకు ఉపయోగపడుతుందనుకుంటే కింద వాట్సాప్ లింక్ ద్వారా గ్రూపులలో షేర్ చేయండి.

Follow us on: Google News  Twitter  Koo

Post a Comment

Previous Post Next Post