ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే ప్రమాదమా?

                ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే ప్రమాదమా? 


 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా మంది జీవితమే మారిపోయింది. అన్నీ స్మార్ట్ ఫోన్లలోనే లభిస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అరచేతిలో అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో యువత చాలా మంది ఎక్కువ శాతం ఫోన్లకే అతుక్కుపోయి ఉంటున్నారంటే ఆశ్చర్యం లేదు. ఫోన్ లో కాల్ మాట్లాడడం, వీడియోలు చూడడం, మ్యూజిక్ వినడం చేస్తున్నారు. అంతే కాదు సౌండ్ బయటకు రాకుండా కేవలం తమ వరకే వినిపించేలా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ఐతే ఎక్కువ గంటలు ఇలా ఇయర్ ఫోన్స్  వాడడం అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. దీర్ఘకాలంలో చెవుడు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

 ఇయర్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించనిపక్షంలో మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెద్దగా సౌండ్ పెట్టుకుని పాటలు వినేవారి చెవులు త్వరగా పాడవుతాయని చెబుతున్నారు. నిజానికి మన చెవులు.. కళ్లలాగానే చాలా సున్నితమైనవి. ఇవి బయట నుంచి వచ్చే ధ్వని లేదా శబ్దాలకు వేగంగా స్పందిస్తాయి. చెవుల్లోని సున్నితమైన భాగాలు దెబ్బతింటే సరి చేయడం చాలా కష్టం. అందుకే ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు సౌండ్ 60 డెసిబుల్స్ కంటే ఎక్కువగా పెట్టకపోడం మంచిది. ఇయర్ బడ్స్ ప్యాక్ పైనే ఈ విషయం రాసి ఉంటుంది. ఎక్కువగా సౌండ్ పెట్టుకోవడం మంచిది కాదనే వార్నింగ్ కూడా వస్తుంది. ఐతే ఫోన్స్ వాడే వారు డెసిబుల్స్ లో సౌండ్ చూసుకుని పెట్టుకోవడం కష్టమే. కానీ వాల్యూమ్ 50 శాతం కంటే ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడం సేఫ్ అని చెప్పవచ్చు. 

ఇయర్ ఫోన్స్ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి?

ఇయర్ ఫోన్స్ చెవుల్లోకి గట్టిగా ఫిట్ అవడం వల్ల గాలి ఆడదు. పైగా చెవుల్లోపలి భాగాలు పొడిబారడం, దురద వంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వీటితోపాటు బ్యాక్టీరియా ఇన్పెక్షన్లు కూడా వస్తాయి. కాబట్టి ఇయర్ బడ్స్ వాడే వారు వాటిని తరచుగా శుభ్రం చేసుకోవాలి. అలాగే రోజులో ఎక్కువ గంటలు చెవుల్లోనే వాటిని ఉంచుకోకుండా బయటకు తీయడం మంచిది. 

హెడ్ ఫోన్స్ ఓ రకంగా బెటర్ 

ఇయర్ బడ్స్ తో పోలిస్తే హెడ్ ఫోన్స్ ఓ రకంగా మంచివని చెప్పవచ్చు. ఐతే బెటర్ కదా అని వీటిని కూడా ఎక్కువగా వాడుకోవచ్చని కాదు. తప్పదనుకుంటే మాత్రమే వాడడం మంచిది. ఇయర్ ఫోన్స్ తో పోలిస్తే .. హెడ్ ఫోన్స్ నుంచి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తక్కువ. అలాగే ఇవి చెవులను నిండుగా కప్పి ఉంచుతాయి. ఇయర్ కెనాల్ నుంచి కర్ణభేరీకి మధ్య దూరాన్ని కాస్త పెంచుతాయి. తక్కువ సౌండ్ తో వీటిని ఉపయోగిస్తే వినికిడి లోపాలు వచ్చే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. 

Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

ఇక ఇతరుల ఇయర్ ఫోన్స్ తీసుకుని వాడకపోవడమే మంచిది. దీని వల్ల చాలా వరకు ఇన్ఫెక్షన్లు నివారించొచ్చు. 


నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.

Post a Comment

Previous Post Next Post