కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలి?

                 కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలి?


 ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కునే అనారోగ్య సమస్యల్లో  కడుపు నొప్పి కూడా ఒకటి. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ఆహారం జీర్ణం కాకపోవడం, తిమ్మిర్లు, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు కారణాలు కావచ్చు. కడుపు నొప్పి ఉన్నప్పుడు చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. ఏం తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదనే విషయాలు తెలుసుకోవాలి. కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏ ఆహారాలు తీసుకోవచ్చు? ఏవి తీసుకుంటే ఇబ్బంది మరింతగా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


 కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలన్నా తినేందుకు ఆసక్తి అనిపించదు. ముఖ్యంగా వాంతులు, విరేచనాలు, వికారం ఉన్న వారికి ఇది మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోనిపక్షంలో మరింత నీరసం ఆవహిస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో  తేలికపాటి ఆహారాలు అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం మంచిదని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. కడుపు నొప్పి ఉన్న సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారాలు తీసుకోవద్దనే విషయంపై అవగాహన ఉండడం మంచిది. కడుపు నొప్పి ఉన్నప్పుడు చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. ఘన ఆహారాలు తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ద్రవ పదార్థాలతో మొదలు పెట్టడం మంచిది.  ఆ తర్వాత  క్రమంగా ఘన పదార్థాలు తీసుకోవచ్చు. అంతే కాదు ద్రవ పదార్థాలు తేలిగ్గా  కడుపులోకి వెళ్లడమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి. ఇందులో భాగంగా శీతల పానీయాలు, పళ్ల రసాలు, పలుచగా ఉండే  సూప్స్, కొబ్బరినీళ్ల వంటివి తీసుకోవాలి. ద్రవ పదార్థాల్లో పొటాషియం, క్యాల్షియం, సోడియం ఉంటే కడుపు కాస్త తేలికపడుతుంది. కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శరీరం ఎక్కువగా నీరు కోల్పోతుంది. ఇలా డీహైడ్రేషన్ బారిన పడ్డ శరీరాన్ని తిరిగి సరి చేసేందుకు ద్రవ పదార్థాలు ఉపయోగపడతాయి. అంతే కాదు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు శరీరానికి కాస్త శక్తినిస్తాయి. 

  ద్రవ పదార్థాలు తీసుకున్న తర్వాత  క్రమంగా ఘన పదార్థాలు ప్రారంభించుకోవచ్చు. వీటిలోనూ తేలికగా జీర్ణమయ్యే వాటిని ఎంచుకోవడం మంచిది. అన్నింటి కంటే ముందుగా తేలికగా జీర్ణమయ్యే వాటిలో అరటి పండ్లు ఒకటని చెప్పవచ్చు. ఇవి జీర్ణప్రక్రియను తేలిగ్గా ఉంచడమే కాకుండా పొటాషియం, మెగ్నీషియం వంటి  ఖనిజ లవణాలను శరీరానికి అందిస్తాయి. వాంతులు, విరేచనాల వల్ల కోల్పోయిన ఈ ఖనిజ లవణాలను అరటి పండ్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చు. 

ఆ తర్వాత ఆపిల్ సాస్ తీసుకోవడం ఉపకరిస్తుంది. దీని ద్వారా శరీరానికి పీచుపదార్థం, పెక్టిన్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. పీచు పదార్థం కారణంగా డయేరియా నుంచి విముక్తి లభిస్తుంది. ఘన పదార్థాలు తీసుకునే ముందుగా కాస్త తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోవాలి. అంటే టోస్ట్ చేసిన వైట్ బ్రెడ్ లాంటివి అన్నమాట. ఇందులో ఫైబర్ లేకపోయినా జీర్ణక్రియను ఇబ్బంది పెట్టకుండా త్వరగా జీర్ణమైపోతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మందంగా ఉన్న కడుపు కాస్త సాధారణ స్థితికి రాగానే మెల్లగా ఘన పదార్థాలు తీసుకోవచ్చు. ఐతే ఈ ప్రక్రియకు ఒకటి నుంచి రెండు రోజుల వరకు సమయం పడుతుంది. రెండు రోజుల తర్వాత మంచి ప్రోటీన్ ఉండే ఘన పదార్థాలు, తాజా కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు తీసుకోవచ్చు. 

Read Also: వెన్ను నొప్పి బాధిస్తోందా ?ఇలా చేయండి

Read Also: మెదడు ఆరోగ్యానికి మెరుగైన ఆహారం

 కడుపు నొప్పి ఉన్న సమయంలో కొన్ని ఆహార పదార్థాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. వాటిలో ముఖ్యమైనవి పాలు, జున్ను, ఐస్ క్రీమ్  లాంటి పాల ఉత్పత్తులు. ఇవి జీర్ణక్రియను మరింతగా ఇబ్బంది పెడతాయి. మజ్జిగ కొంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎక్కువగా తీసుకోకుండా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. ఇక వేపుళ్లు, ఘాటు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కడుపు నొప్పి ఉన్న సమయంలో తీసుకోవద్దు. వాటిలో ఉండే కొవ్వులు, నూనెలు పరిస్థితిని మరింతగా దిగజార్చే అవకాశం ఉంది. అలాగే సోడాలు తాగడం మంచిది కాదు. అందులో ఉండే గ్యాస్, అదనపు చక్కెర విరేచనాలు, వాంతుల పరిస్థితిని మరితంగా ఇబ్బంది పెడుతుంది. ఐతే కడుపు ఇబ్బందిగా ఉన్నప్పుడు తాజా పండ్లు తీసుకోవడం లేదా పచ్చి కూరగాయలు తీసుకోవడం మంచిదని చాలా మంది భావిస్తుంటారు. ఇది సరైంది కాదు. ఆరోగ్యంగా ఉన్న వారికి ఇది మంచిదే కానీ.. పొట్టలో సమస్య ఉన్న వారిని ఇబ్బంది పెడుతుంది. 

 కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉండేలా ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. ఫలితంగా కడుపులో ఇన్ఫెక్షన్లు ప్రారంభం కాకుండా కాపాడుకోవచ్చు. కడుపులో ఆమ్లాల స్థాయిని నియంత్రించుకునేందుకు ఎక్కువగా ఆమ్లాలు ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.

Follow us on: FaceBook Google News Twitter

Note: ఈ స్టోరీ ఉపయోగపడుతుందని భావిస్తే మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు, బంధువులకు వాట్సప్ ద్వారా షేర్ చేయండి.

Post a Comment

Previous Post Next Post