T Hub 2.0 లోపల ఎలా ఉందో చూశారా?
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఇంక్యుబేటర్ T Hub 2.0. ఇటీవలే జూన్ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమైన T Hub 2.0లో అత్యాధునికమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి ఇందులో 4 వేల స్టార్టప్ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. మొత్తం రూ. 400 కోట్లతో 10 అంతస్థుల్లో T Hub 2.0 నిర్మాణం జరిగింది. 2015లో ప్రారంభమైన T Hub కంటే ఇది ఐదు రెట్లు పెద్దగా ఇది నిర్మితమైంది.
ఐటీ, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఏరో స్పేస్, వాహన రంగాల్లోని స్టార్టప్ సంస్థలకు T Hub 2.0 అవకాశం కల్పించనుంది. ముఖ్యంగా అంకుర సంస్థలకు హైదరాబాద్ ను కేరాఫ్ అడ్రస్ గా చేయడమే T Hub 2.0 వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అంకుర సంస్థల ద్వారా ముందుకొచ్చే వారు.. తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు ఇది ఊతమిస్తుంది. తద్వారా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. T Hub 2.0లో అంకుర సంస్థల కోసం ఆఫీస్ స్పేస్ మాత్రమే కాకుండా ఫుడ్ కోర్టులతోపాటు అత్యాధునికమైన సౌకర్యాలు కల్పించారు. అవి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి.