మెదడు ఆరోగ్యానికి మెరుగైన ఆహారం

                            మెదడు ఆరోగ్యానికి మెరుగైన ఆహారం

Image Credit: Alexander Mils

 మనం రోజువారీ తీసుకునే ఆహారం శరీరంతోపాటు మెదడుపైనా ప్రభావం చూపిస్తుంది. ఆహారం తీసుకున్న తర్వాత అందులో ఉండే పోషకాలు మెదడుకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఐతే మెదడు ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారాలు తీసుకున్నప్పుడే అంతా సవ్యంగా సాగుతుంది. లేనిపక్షంలో మెదడు చురుకుదనాన్ని కోల్పోయి... తద్వారా శారీరక క్రియలన్నీ నిస్తేజంగా మారుతాయి. ఈ క్రమంలో మెదడుకు మెరుగైన ఆహారాలు ఏంటి? వాటి ద్వారా లభించే పోషకాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

 మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. మెదడు నుంచి అందే సంకేతాల వల్ల శరీరంలోని ప్రతి అవయవం తన పని తాను చేయగలుగుతుంది. ఈ క్రమంలో మెదడు ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఐతే మెదడు ఆరోగ్యం చక్కగా ఉండాలంటే సరైన పోషకాలు అందించాలి. మనం ప్రతి రోజూ తీసుకునే విటమిన్లు, ఇతర ఖనిజలవణాలు మెదడు నిర్మాణానికి ఉపయోగపడతాయి. అంతే కాదు మెదడులోని కణాలు సరైన రీతిలో పని చేసేలా సహాయపడతాయి. తద్వారా మనం చక్కగా పనులు చేసుకోవడం, చురుగ్గా ఆలోచించడం సాధ్యమవుతుంది. ఇక మెదడు ఆరోగ్యానికి విటమిన్ B, విటమిన్ E, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, చోలిన్ లాంటి పోషకాలు చాలా ముఖ్యం. విటమిన్ B,B12, ఫోలిక్ యాసిడ్ వల్ల మెదడుకు కావాల్సిన రసాయనాల ఉత్పత్తి జరుగుతుంది. ఒకవేళ ఈ పోషకాలు ఆహారాల నుంచి లభించని పక్షంలో మెదుడులో నరాలు దెబ్బతినడమే కాకుండా శక్తి సన్నగిల్లడం, మతిమరుపు, ఆందోళన, ఆలోచన మందగించడం, నేర్చుకోవడానికి సరైన శక్తి లేకపోవడం జరుగుతుంది. ఇక విటమిన్ E కణాలు నాశనం కాకుండా సహజసిద్ధంగా రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ E లోపించినట్లయితే కండరాల బలహీనత, అస్థిరత్వంతోపాటు బలహీనమైన సమన్వయం లాంటి సమస్యలు కనిపిస్తాయి. 

Read Also: యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం

మెదడు ఆరోగ్యంలో  ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాల పాత్ర

  ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు మెదడు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. మెదడు నిర్మాణంలో పాలుపంచుకోవడమే కాకుండా నరాల వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. మరోవైపు మెదడులో వాపులు ఏర్పడకుండా, జ్ఞాపకశక్తి కోల్పోకుండా.. ఆహారం ద్వారా లభించే యాంటీఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. ఇక మెదడుకు అత్యధికంగా ఉపయోగపడే పోషకపదార్థం చోలిన్. ఇది కూడా మనకు ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. మెదడులోని నరాలు రక్షించడంతోపాటు రసాయనాల ఉత్పత్తిలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఇది  లోపించినట్లయితే జ్ఞాపకశక్తిలో లోపాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ పోషకాలు అన్నీ రోజువారీ ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం మెడిటేరియన్ డైట్, మైండ్ డైట్, డ్యాష్ డైట్ చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో ఏ డైట్ ఎంచుకున్నప్పటికీ.. రోజువారీ ఆహారంలో ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, చికెన్, చిక్కుళ్లు, గింజధాన్యాలు, విత్తనాలు, బెర్రీ పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇక ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఎక్కువగా మార్కెల్, ట్రౌట్, హెర్రింగ్, సర్డినెస్ లాంటి చేపల నుంచి లభిస్తాయి. ఐతే శాఖహారులు మాత్రం వీటికి ప్రత్యామ్నాయంగా అవిశె గింజలు, చియా విత్తనాలు, గింజ ధాన్యాలు, వాల్ నట్స్, బాదాములు, పిస్తా, అవకాడో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఒమెగా ఫ్యాటీ 3 ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక రోజువారీ ఆహారంలో ముతకబియ్యం, ఓట్స్, క్వినోవా లాంటివి తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. 

జీవన సరళిలో  ఎలాంటి మార్పులు  అవసరం?

 మరోవైపు జీవన విధానంలో మార్పులు చేసుకోవడం కూడా మెదడు ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంటే కొవ్వు, చక్కెర శాతం ఉన్న పదార్థాలకు దూరంగా ఉండడం, మద్యం, పొగ తాగడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండడం అన్నమాట. ముఖ్యంగా చక్కెర ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు నిర్మాణం, చురుకుదనం దెబ్బతింటుంది. అలాగే మద్యం తాగడం వల్ల కూడా మెదడులో అనేక అనర్థాలు కలుగుతాయి. ఆల్కహాల్.. మెదడు చురుకుదనాన్ని కోల్పోయి మొద్దుబారేలా చేస్తుంది. ఫలితంగా ఆందోళన, నిరాశ ఆవహించి క్రమంగా మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. 

 మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మూడ్ ను అభివృద్ధి చేసే రసాయనాలు చక్కగా ఉత్పత్తి అవుతాయి. అలాగే మెదడు ఆరోగ్యాన్ని చక్కగా ఉంచేందుకు ధ్యానం, యోగా లాంటివి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని రోజూ ఆభ్యాసన చేయడం మంచిది.

Read Also: ప్రీడయాబేటిక్ స్టేజీ అంటే ఏంటి

 Follow us on: FaceBook Google News Twitter 


Post a Comment

Previous Post Next Post