what is Prediabetes Is healthy lifestyle controls it ప్రీడయాబేటిక్ స్టేజీ అంటే ఏంటి నియంత్రణ సాధ్యమేనా

    ప్రీడయాబేటిక్ స్టేజీ అంటే ఏంటి? నియంత్రణ సాధ్యమేనా?

Image Credit: Pixels

 మధుమేహం లేదా చక్కెర వ్యాధి లేదా అందరూ సాధారణంగా పిలుచుకునే షుగర్ జబ్బు.. ఇది ఒక్కసారి వచ్చిందంటే పూర్తిగా నయం చేసుకోవడం కష్టం. ఓ రకంగా చెప్పాలంటే నియంత్రణంలో ఉంచుకుంటూ జబ్బుతోనే జీవితాంతం గడిపేయాల్సి ఉంటుంది. ఐతే సాధారణంగా 45  దాటిన తర్వాత డయాబేటీస్ రావడం పరిపాటిగా మారుతోంది. కొంత మందిలో వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది. ఏదేమైనా మధ్య వయసు దాటిన వారు ఈ  వ్యాధిపట్ల కొంత అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే 45 ఏళ్లు దాటిన తర్వాత రిస్క్ అనేది మొదలవుతుంది. దీన్నే ప్రీడయాబెటిక్ స్టేజ్ గా వ్యవహరిస్తారు. అసలు ప్రీ డయాబేటిక్ స్టేజ్ అంటే ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబేటిక్ స్టేజ్ లోకి వెళ్లకుండా నియంత్రించుకోవచ్చు? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

 చికిత్స కంటే నివారణే అత్యుత్తమ మార్గమనే సామెత చక్కెర వ్యాధి విషయంలో సరిగ్గా సరిపోతుంది. అంటే జబ్బు రాకముందే దాన్ని నివారించుకోగలిగితే ఆ దిశగా ప్రయత్నం చేయగలిగితే అత్యుత్తమంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. సాధారణంగా 45 ఏళ్ల వయసు దాటిన వారిలో మధుమేహం మొదలయ్యే అవకాశం ఉంటుంది. అధిక శారీరక బరువు, వ్యాయామం లేకపోవడం, మానసిక ఆందోళన ఇందుకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన తర్వాత మెల్లగా చాపకింద నీరులా డయాబేటీస్ ప్రారంభమవుతుంది. దీన్నే ప్రీ డయాబేటిక్ స్టేజ్ అని వ్యవహరిస్తారు. కానీ ఈ ప్రీ డయాబేటీక్ స్టేజ్ ను సాధారణంగా ఎవరూ గుర్తించలేరు. ఎందుకంటే ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఐతే రక్తంలో సాధారణం కంటే చక్కెర స్థాయి ఎక్కువగా ఉండడమే డయాబేటీస్ అన్నమాట. స్థూలకాయం ఉన్న వారికి, వ్యాయామం చేయని వారికి ఇది క్రమంగా టైప్ 2 డయాబేటీస్ కు దారి తీస్తుంది. కానీ జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్రీ డయాబేటిక్ స్థాయిలోనే మధుమేహం బారిన పడకుండా నివారించుకోవచ్చు. 


 డయాబేటీస్ రాకుండా ఉండాలంటే ప్రధానమైన విధానాల్లో బరువును నియంత్రణలో ఉంచుకోవడం ఒకటి. సాధారణం కంటే ఎక్కువ బరువు ఉన్నట్లయితే.. దాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించాలి. బరువు కాస్త తగ్గించుకున్నా అది పెద్ద తేడాకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటే స్థూలకాయం ఉన్న వారు తక్కువలో తక్కువ కనీసం 7 శాతమైనా తమ బరువును తగ్గించుకుంటే దాని వల్ల కలిగే ఫలితాలు అనూహ్యాంగా ఉంటాయి. ఉదాహరణకు 80 కిలోల బరువు ఉన్న వారు... అందులో 7శాతం అంటే కనీసం 6 కిలోలు తగ్గినా ప్రయోజనం ఉంటుంది. బరువు తగ్గేందుకు తగినంత పరిమాణంలో కేలరీలు తీసుకుంటూ ఉండడమే కాకుండా సరైన వ్యాయామం చేయాలి. ఫలితంగా ఎక్కువ కేలరీలు కరిగించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం వారంలో కనీసం 30 నిముషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం, ఎయిరోబిక్స్ ఎక్సర్ సైజ్, స్విమ్మింగ్, డాన్సింగ్,  వెయిట్ లిఫ్టింగ్ లాంటివి చక్కగా ఉపయోగపడతాయి. 


 ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం కూడా డయాబేటీస్ రాకుండా నివారిస్తుంది. రోజువారీ భోజనం చేసేటప్పుడు ప్లేటులో సగం వరకు తప్పకుండా పిండి లేని కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అంటే మొలకలు, క్యారెట్ల లాంటివ అన్నమాట. అలాగే పావు ప్లేటు వరకు బంగాళదుంప, మొక్కజొన్న, బఠానీ లాంటి పిండి పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చివరి పావు భాగంలో చికెన్, చేపలు, చిక్కుళ్ల వంటి మాంసకృత్తులు కలిగిన ఆహార పదార్థాలు ఉండేలా మెనూ తయారు చేసుకోవడం మంచిది. అలాగే ప్రీ డయాబేటీస్ స్టేజీలో ఉన్న వారు బేక్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన ఆహారాలు, శీతల పానీయాలు,  పాస్తా వంటి వాటి జోలికి వెళ్లవద్దు. ఇవి త్వరగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచేస్తాయి. ఆహారంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజూ సరైన సమయానికి నిద్రపోవడం, సరైన సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పూట కనీసం 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. 


 మధుమేహం రావడానికి పొగ తాగడం కూడా ఓ కారణం కావచ్చు. పొగ తాగే వారిలో 30 నుంచి 40 శాతం వరకు టైప్ 2 డయాబేటీస్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పొగ తాగే అలవాటు ఉన్న వారు మానేస్తే మంచిది. ఇలా జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబేటీస్ ను నివారించుకోవచ్చు. 

 Read Also: వ్యాపారవేత్తతో నటి పూర్ణ పెళ్లి

Read Also: యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం


Post a Comment

Previous Post Next Post