తగ్గిన బరువు అలాగే మెయింటేన్ చేయాలంటే!
![]() |
Image: Ketut Subiyanto |
శారీరక బరువు తగ్గించుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. స్థూలకాయం లేదా ఊబకాయం ఉన్న వారు బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు తగ్గించుకోవడం అంత సులభమైన విషయం కాదు.. కానీ ఎన్నో కష్టనష్టాలకోర్చి కొంత మంది సరైన విధంగా బరువు తగ్గించుకుంటారు. అలాంటి వారికి.. తిరిగి దాన్ని నిర్వహించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మళ్లీ బరువు పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తగ్గిన బరువును నియంత్రించుకునే విధానాలు ఏంటి? జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ? ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక శారీరక బరువు అనేది అనేక అనారోగ్యాలకు మూలం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న జీవన శైలి, ఆహారపదార్థాల కారణంగా చాలా మంది స్థూలకాయం బారిన పడుతున్నారు. ఆ తర్వాత బరువు తగ్గించుకునేందుకు రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. నిజానికి పెరిగిన బరువును తగ్గించుకోవడం అంత సులువైన విషయం కాదు. అలాగే బరువు తగ్గిన తర్వాత.. దాన్ని నిర్వహించడం అనేది కూడా సవాలుతో కూడుకున్నదనే చెప్పవచ్చు. కానీ జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే అసాధ్యమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గిన తర్వాత సానుకూల దృక్పథం అలవాటు చేసుకుంటే దాన్ని నిర్వహించడం తేలిక అవుతుందని చెబుతున్నారు.
వ్యాయామాలు జీవితంలో భాగం చేసుకోవాలి
బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు. ఐతే బరువు తగ్గిన తర్వాత కూడా రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడాన్ని కొనసాగించాలి. ఉదయం, సాయంత్రం నడవడం, ఎయిరోబిక్స్ , స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటి వాటిని చేయడం ఆపివేయవద్దు. అంటే వ్యాయామం చేయడాన్ని రోజువారీ జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలన్నమాట. అలా చేసిన పక్షంలో రోజంతా చురుగ్గా ఉండవచ్చు.
ఆరోగ్యకరమైన డైట్ పాటించాలి
మరోవైపు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా బరువుపై ప్రభావం చూపిస్తుంది. తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, లేత మాంసం, గుడ్లు, పాలు డైట్ లో ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఇంకాస్త బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో కొంత మంది ఉదయం అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనం చేయకుండా ఉంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఇలా ఒక పూట ఆహారం మానుకోవడం వల్ల అనర్థాలే ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు. అంతే కాదు ఒక పూట ఆహారం మానేయడం వల్ల మరో పూట ఎక్కువగా తినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా తిరిగి బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
బరువు నియంత్రణ ప్రణాళిక అవసరం
ఒకే రకమైన బరువును క్రమపద్దతిలో నిర్వహించుకోవడం అనేది సవాలుతో కూడుకున్నదే. కాబట్టి ప్రతి రోజూ బరువు చూసుకుంటూ అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కానీ చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఐతే బరువును రోజూ చెక్ చేసుకుంటూ ఉండడం సత్ఫలితాలు ఇస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే రోజూ ఏ వేళకు ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎలాంటి పానీయాలు తీసుకుంటున్నాం.. అనే విషయాలను కూడా క్రమం తప్పకుండా నోట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బరువును నిర్వహించుకునే సమాచారం ఎవరికి వారు రూపొందించుకోవచ్చు.
మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి
బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారు సరైన నిద్ర కూడా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పూట సరైన సమయానికి నిద్రపోవడం మళ్లీ ఉదయం సరైన సమయంలో నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా పనులు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వల్ల మానసిక సాంత్వన చేకూరుతుంది. ఇది కూడా శారీరక బరువుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
Read Also: తిరుమల లడ్డూ చరిత్ర ఏంటో తెలుసా?
నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.