అమర్‌నాథ్ యాత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?
రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ అమర్‌నాథ్ యాత్ర షురూ కాబోతోంది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 11 వరకు మొత్తంగా 43 రోజుల పాటు నిర్వహించేందుకు శ్రీ అమర్ నాథ్ దేవస్థానం బోర్డు (SASB) నిర్ణయించింది. తాజాగా అమర్‌నాథ్ యాత్ర ఏర్పాట్లపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా యాత్రికుల భద్రతతోపాటు, ఆరోగ్యం, టెలికం కనెక్టివిటీ, నీరు, విద్యుత్ సరఫరా, శానిటేషన్ తదితర అంశాలపై చర్చించారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
ఆగస్టు 11 రక్షా బంధన్ సందర్భంగా ముగియనున్న అమర్ నాథ్ యాత్ర కోసం 15 వేల భద్రతా సిబ్బందితో యాత్రికులకు భద్రత కల్పించనున్నారు. ఆర్మీ జవాన్లు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, జమ్ము కాశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పాయింట్లలో యాత్రికులకు సేవలు అందించనున్నారు. గతంలో కంటే ఈ ఏడాది యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు అదనంగా కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. ముఖ్యంగా అతి ఎత్తైన ప్రదేశం దృష్ట్యా భక్తుల ఆరోగ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. అందులో ఆక్సిజన్ సిలిండర్లతోపాటు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, మెడికల్ బెడ్స్ సౌకర్యాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది.
అమర్ నాథ్ యాత్రకు ఎలా వెళ్లాలి?
అమర్ నాథ్ యాత్ర ముఖ్యంగా రెండు మార్గాల్లో సాగుతుంది. ఒకటి పహల్గామ్ మార్గం.. కాగా రెండోది బల్తాల్ మార్గం. అమర్ నాథ్ యాత్ర కోసం ముందుగా పహల్గాం లేదా బల్తాల్ చేరుకోవాలి. అక్కడి నుంచి అంతా నడక మార్గమే ఉంటుంది. పహల్గాం నుంచి అమర్‌నాథ్ వరకు 28 కి.మీ. దూరం. ఈ మార్గం కాస్త ఫరవాలేదు. మరోవైపు బల్తాల్ నుంచి అమర్‌నాథ్‌కు వరకు 14 కి.మీ దూరం. కానీ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండే మార్గమని చెప్పవచ్చు.
అమర్‌నాథ్ గుహ చరిత్ర
అమర్‌నాథ్ గుహ చరిత్ర వేల ఏళ్ల నాటిది. శ్రీనగర్‌కు దాదాపు 145 కి.మీ. దూరంలో ఉన్న ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో హిమాలయాల మీద ఉంది. ఇక్కడ గుహలో శివలింగం సహజంగా ఏర్పడింది. గుహ లోపల, మంచుతో కూడిన నీటి బిందువులు నిరంతరంగా కారుతూ ఉంటాయి. వీటి ఆధారంగా దాదాపు 10 నుంచి 12 అడుగుల ఎత్తులో మంచు శివలింగం ఏర్పడుతుంది. ఈ శివ లింగాన్నే బాబా అమర్‌నాథ్ అని వ్యవహరిస్తారు. శివలింగం ఎత్తు పెరగడం, తగ్గడం అనేది చంద్రునితో ముడిపడివుంటుంది. పౌర్ణమి రోజున శివలింగం పూర్తి పరిమాణంలో ఉంటుంది. అలాగే అమావాస్య రోజున శివలింగం పరిమాణం కొద్దిగా తగ్గుతుంది.
Read Also: ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే ప్రమాదమా?
ఇక బాబా అమర్‌నాథ్ గుహలో శివలింగంతో పాటు గణేశుడు, పార్వతి, భైరవ్ మహారాజ్ విగ్రహాలు కనిపిస్తాయి.