కొత్త ఇల్లు కొనేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఐతే ఆర్థికంగా బలంగా ఉన్నవారు త్వరగానే తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు. కానీ మధ్యతరగతి వారు కొత్తగా ఇల్లు కొనాలంటే కాస్త శ్రమతో కూడుకున్న విషయమే. అయినప్పటికీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో పెరిగిన ధరల దృష్ట్యా చాలా మంది ఇంటి కొనుగోలు కోసం బ్యాంకు రుణాలపైనే ఆధారపడుతున్నారు. ఐతే గృహ రుణాలు భారం కావొద్దన్నా.. సరైన మొత్తాన్ని వెచ్చించి ఇల్లు కొనుగోలు చేయాలన్నా.. కొన్ని ముఖ్య అంశాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
RERA, ఇతర డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి
ఇంటి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మఖ్యమైన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆస్తికి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంటికి స్థానిక అనుమతులు అన్నీ సరిగ్గా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA)లో ఆస్తి రిజిస్టర్ అయిందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. దీని వల్ల ఇంటి నిర్మాణం, ఆ తర్వాత లోపాలు తెలుస్తాయి. అలాగే అన్ని ధ్రువపత్రాలు, క్లియరెన్స్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫలితంగా రుణాలు పొందేందుకు సులువవుతుంది.
EC, టైటిల్ డీడ్ చెక్ చేసుకోవాలి
కొత్త ఇంటిని కొనే ముందు ఈసీ(EC) ముందుగా చెక్ చేసుకోవాలి. దీని వల్ల ఆ ఆస్తికి హక్కుదారు ఎవరు? వాళ్లకు ఆస్తిని బదలాయించే హక్కు ఉందా? అనే విషయాలు తెలుస్తాయి. అలాగే గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు..ఈసీ కచ్చితంగా అవసరమవుతుంది. మరోవైపు భూమి టైటిల్ డీడ్ ను కూడా క్షుణ్నంగా పరిశీలించాలి.
స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు
ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు అనేక స్టాంప్ డ్యూటీ సహా ఇతర అనేక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి.. వాటన్నింటినీ ముందుగానే అంచనా వేసుకోవాలి. కొనుగోలు సమయంలో చూసుకోనట్లయితే.. తీరా సమయానికి అనూహ్యాంగా ఖర్చలు పెరిగే ప్రమాదం ఉంది. వాటిని క్షుణ్నంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్టాంప్ డ్యూటీ 5-7 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 1-2 శాతం, నిర్వహణ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు వంటివి మొత్తంగా కొనుగోలు చేసే ఇంటి ధరలో చేరుతాయి.
క్రెడిట్ స్కోర్
ఇంటి కొనుగోల సమయంలో రుణాలపై ఆధారపడే వారు మరో విషయాన్ని తప్పకుండా చెక్ చేసుకోవాలి. బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థలు ఇంటిపై రుణం ఇచ్చే సమయంలో క్రెడిట్ స్కోర్ ఆధారంగా అప్పు ఇస్తాయి. కాబట్టి క్రెడిట్ స్కోరును వీలైనంతగా ఎక్కువగా ఉంచుకోవాలి. అంటే 750 ఇంకా అంత కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణ సదుపాయం లభించడం సులువవుతుంది. అంతే కాదు తక్కువ వడ్డీ రేటులోనూ రుణం వచ్చే అవకాశం ఉంటుంది. మరో విషయం ఏంటంటే ఇప్పటికే పర్సనల్ లోన్ లేదా ఇతర లోన్లు ఉన్నట్లయితే వాటి వాయిదాలను కూడా త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. దీని వల్ల గృహ రుణం తీసుకున్నప్పుడు వాయిదాలు సులువుగా తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.
ఆర్ధిక సామర్థ్యాన్ని బేరీజు వేసుకోవాలి
అలాగే గృహ రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఎవరికి వారు తమ ఆర్ధిక సామర్థ్యాన్ని బేరీజు వేసుకోవాలి. రోజువారీ ఖర్చులు పోను మిగతా డబ్బు వాయిదాలు చెల్లించడానికి వీలు పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే డౌన్ పేమెంట్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. నిజానికి కొత్త ఇంటి కోసం బ్యాంకులు 75 శాతం నుంచి 90 శాతం వరకు రుణ సదుపాయం కల్పిస్తాయి. కానీ వడ్డీ కూడా అదే మొత్తంలో పడుతుంది కాబట్టి.. నెలవారీ వాయిదా సొమ్ము పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో వీలైనంత వరకు డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లించుకోవడం వల్ల రుణభారం తగ్గుతుంది.
Read Also: రోజూ బాదం తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
ఇక కొత్త ఇంటి సమీపంలో స్కూళ్లు, ఆసుపత్రులు, రైలు, రోడ్డు కనెక్టివిటీ, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవి సౌకర్యాలను పెంచడంతోపాటు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి.
Read Also: షుగర్ వ్యాధి రాకుండా చేసుకోవచ్చా?