తమన్నాతో అదే గొడవ
కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన F3 సినిమా థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. చిత్రం విడుదల సమయంలో హీరో హీరోయిన్లు, మిగతా ఆర్టిస్టులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రమోషన్లలో దాదాపుగా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కానీ హీరోయిన్ తమన్నా మాత్రం కనిపించ లేదు. దీంతో ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకుల్లోనూ పలు అనుమానాలు నెలకొన్నాయి. అంతే కాదు దర్శకుడు అనిల్ రావిపూడికి తమన్నాకు మధ్య గొడవ జరిగిందనే ప్రచారం కూడా జరిగింది. అందుకే సినిమా ప్రమోషన్ విషయంలో మిల్కీ బ్యూటీ దూరంగా ఉందనే ఇటు మీడియా సహా సోషల్ మీడియాలో హోరెత్తింది. ఐతే ఈ విషయంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.
తమన్నాతో గొడవ వాస్తవమే: అనిల్ రావిపూడి
హీరోయిన్ తమన్నాతో సెట్స్ లో ఉన్నప్పుడు గొడవ జరిగిన మాట వాస్తవమేనని అనిల్ స్పష్టం చేశారు. ఐతే అవేమీ పెద్ద గొడవలు కాదని క్లారిటీ ఇచ్చారు. సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండడం.. వారితో పని చేసేటప్పుడు చిన్న చిన్న చిరాకులు పరాకులు సహజమేనని అన్నారు. F3 సినిమా షూటింగ్ సమయంలో రాత్రి కొద్దిసేపు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని తమన్నాతో చెప్పానన్నారు. కానీ ఉదయం జిమ్ చేసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పిందన్నారు అనిల్ రావిపూడి. ఇలా తమ మధ్య రెండు రోజులపాటు హీట్ వాతావరణం కొనసాగిందని.. ఆ తర్వాత అంతా కామ్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చారు.
అందుకే ప్రమోషన్స్ కు రాలేదు:అనిల్ రావిపూడి
ఇక సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడానికి.. షూటింగ్ సమయంలో జరిగిన గొడవలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇతరత్రా పనుల వల్ల తమన్నా బిజీగా ఉండడం వల్లే సినిమా ప్రమోషన్స్ కు రాలేకపోయిందని చెప్పారు.
మరోవైపు మే 27న రిలీజైన F3 సినిమా.. థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సమ్మర్ హీట్ లో కూల్ కూల్ గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.