ఆరోగ్యంపై 'ఆందోళన' ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

          ఆరోగ్యంపై 'ఆందోళన' ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?


 జీవితంలో బాధ, సంతోషం సర్వసాధారణమే. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. కానీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, పని ఒత్తిళ్లు పలు రకాల ఆందోళనకు కారణమవుతాయి. కానీ వాటిని అధిగమించి సాగిపోవాలి. లేకపోతే సాధారణ జీవితంపై అవి ప్రభావం చూపించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆందోళన కారణంగా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

 ఆనందం, సంతోషం ఉన్నట్టే ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధ, దుఃఖం, ఆందోళన కూడా ఉంటాయి. క్లుప్తంగా అన్నీ కలగలిసినదే జీవితం. ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తూ.. ఆందోళనలను దిగమింగుకుంటూ ముందడుగు వేయడమే జీవితం. ఐతే ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు లేదా అనుకున్న పనులు జరగనప్పుడు కానీ, ఆర్ధికంగా కుంగుబాటు కలిగినప్పుడు గానీ వచ్చే ఆందోళన జీవితగతినే మార్చేస్తుంది. వాటి నుంచి కొంత మంది త్వరగా బయటపడరు. తద్వారా అది ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలపైనా ఆ ప్రభావం ఉంటుంది. ఆందోళన చెందడం వల్ల  నాడీ వ్యవస్థపై అధిక ప్రభావం పడుతుంది. నాడీ వ్యవస్థ అనేది మెదడు, వెన్నుపూస, నరాల్లో న్యూరాన్‌లు అనే ప్రత్యేక కణాలతో రూపొంది ఉంటుంది.  ఆందోళన ఎక్కువ కావడం వల్ల స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ విడుదలవుతుంది. ఫలితంగా గుండె వేగం పెరగడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఇదిలాగే గుండె, కండరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

 ఆందోళన పెరిగినప్పుడు భుజం, మెడ కండరాల్లో ఒత్తిడి ఎక్కువవుతుంది. దీని వల్ల మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే  తెలియకుండానే ఉశ్ఛ్వాసనిశ్వాసాల్లోనూ తేడా వస్తుంది. దీన్ని పెద్దగా ఎవరూ గుర్తించకపోవచ్చు. కానీ ఆస్తమా లేదా  ఊపిరితిత్తుల్లో అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇది ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. మరోవైపు ఆందోళన పెరిగినప్పుడు రక్తపోటు ఎక్కువై ఒక్కోసారి గుండె నొప్పి లేదా స్ట్రోక్ కు కూడా దారి తీయవచ్చు. తరచుగా ఇలాగే జరిగినట్లయితే రక్తనాళికల్లో వాపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా ధమని గోడలపై ఒత్తిడి పడడమే కాకుండా అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయికి దారి తీయవచ్చు. ఆందోళన పెరిగినప్పుడు శరీరంలో స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి అవుతుందని తెలుసుకున్నాం కదా. నిజానికి ఇది మంచిదే. ఆందోళనను సాధారణ స్థాయికి తెచ్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. కానీ అలా ఉపయోగించనిపక్షంలో రక్తంలో చక్కెర రూపంలో ఇది నిల్వ ఉండిపోతుంది. ఫలితంగా స్థూలకాయం, మధుమేహానికి దారి తీస్తుంది. కొంత మందిలో ఈ కారణంగా గుండె సమస్యలు, పక్షవాతం, మూత్ర పిండాల సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చు.  

Read Also: 50 ఏళ్లు దాటిన తర్వాతా చురుగ్గా ఉండడమెలా?

 శరీరంలో ఆందోళన పెరిగినప్పుడు అది రోగ నిరోధక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుంది. బాధ, ఉద్వేగం, ఆందోళనకు సంబంధించే ఆలోచించడం వల్ల ఫ్లూ, హెర్ప్స్, షింజిల్స్ సహా మిగతా వైరస్ లపై రోగ నిరోధక వ్యవస్థ పోరాడలేదు. మరోవైపు ఆందోళన ఎక్కువగా ఉన్న వారికి అతిగా తినే అలవాటు ఉంటుంది. ఫలితంగా కడుపులో ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇది కడుపులో మంటకు దారి తీస్తుంది. అంతే కాదు వాంతులు, వికారం లాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. 

 మరోవైపు ఆందోళన అనేది స్త్రీ, పురుషుల్లో లైంగిక అంశాలపైనా ప్రభావం చూపిస్తుంది. పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి తగ్గిపోయేందుకు కారణమవుతుంది. ఫలితంగా లైంగిక జీవితంపై అనాసక్తి ఏర్పడడమే కాకుండా శుక్రకణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అటు స్త్రీలలోనూ క్రమంగా మెనోపాజ్ కు దారి తీయడమే కాకుండా శరీరమంతా వేడి ఆవిర్ల సమస్యను తెచ్చిపెడుతుంది. నిద్రలేమి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. 

 ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకునేలా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపేందుకు ప్రయత్నించాలి. అంతే కాదు ఒత్తిడిని తగ్గించే మంచి పోషకాలతో నిండిన ఆహారాలు తీసుకుంటూ ప్రతి రోజూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయమాలు, యోగా, ధ్యానం లాంటివి అభ్యాసన చేయడం మంచిది.

ఈ స్టోరీ మీ స్నేహితులు, బంధువులకు ఉపయోగపడుతుందనుకుంటే కింద వాట్సాప్ లింక్ ద్వారా మీ వాట్సప్ గ్రూపులలో షేర్ చేయండి.

Read Also: ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే ప్రమాదమా?

Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.

Post a Comment

Previous Post Next Post