ఇండియాలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్
మనకు తెలియని నగరాలు లేదా పట్టణాలకు వెళ్లినప్పుడు... ఏ ఏ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఈ సమస్యను గూగుల్ మ్యాప్స్ (Google Maps)చాలా వరకు పరిష్కరించింది. ఏమీ తెలియని వారు కూడా సులభంగా గమ్యస్థానం చేరుకునేందుకు సేవలు అందిస్తోంది. అలాంటి గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ఇండియాలో మరో కొత్త ఫీచర్ ను ఆవిష్కరించింది. అదే గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్(Google Maps street view). గూగుల్ మ్యాప్స్ కు ఇది అదనపు ఆకర్షణ కానుంది.
నిజానికి ఈ ఫీచర్ విదేశాల్లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. కానీ ఇండియాలో ఇప్పుడే లాంచ్ చేసింది గూగుల్ మ్యాప్స్. ఇండియాలో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జెనీసిస్, టెక్ మహీంద్రా సహకారం తీసుకుంది.
స్ట్రీట్ వ్యూ ఫీచర్‌తో ఉపయోగాలేంటి?
గూగుల్ మ్యాప్స్ ద్వారా సులభంగా ఆయా లొకేషన్లను సులభంగా తెలుసుకోగలగుతున్నారు. ఇప్పుడు ఇది మరింత సులభతరం కానుంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ వల్ల ఏ రోడ్డులో ఏ వీధి ఎలా ఉంది.. ఆ వీధిలో ఏ ఏ దుకాణాలు ఉన్నాయి.. వాటి కచ్చితమైన దూరం మొత్తంగా అంతా ఇట్టే తెలిసిపోతుంది. వెళ్లాల్సిన గమ్యస్థానానికి రూట్ మ్యాప్ మాత్రమే కాకుండా.. అక్కడికి వెళ్లడంలో ట్రాఫిక్ సమస్యలు.. ఇతరత్రా అంశాలను సులభంగా తెలుసుకోవచ్చన్నమాట. ఐతే ప్రస్తుతం గూగుల్ స్ట్రీట్ వ్యూ బెంగళూరు నగరం వరకే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే దీన్ని హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, పూణే, నాసిక్, అమృత్ సర్, వడోదర లాంటి నగరాలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 50 నగరాల్లో గూగుల్ స్ట్రీ వ్యూ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ మ్యాప్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. మొత్తంగా ఇండియాలో లక్షా 50 వేల కిలోమీటర్ల దూరాన్ని స్ట్రీట్ వ్యూ ఫీచర్ కవర్ చేసే అవకాశం ఉంది.
గూగుల్ స్ట్రీట్ వ్యూ ఉపయోగించడం ఎలా?
* గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సెర్చ్ చేయాలి.
* చూడాలనుకుంటున్న ఏరియా పిన్ చేయాలి.
* ఆ ప్రాంతంలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ కనిపిస్తే ఆ ఐకాన్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి.
* ఆ తర్వాత ఆ ఏరియా స్ట్రీట్ వ్యూలో కనిపిస్తుంది.
* ముందుకు వెనక్కి డ్రాగ్ చేస్తూ మ్యాప్ చూడొచ్చు.