పెట్రోలియం జెల్లీతో అనేక ఉపయోగాలు
శీతాకాలంలో చాలా మంది చర్మం పొడిబారిపోకుండా ఉండడానికి పెట్రోలియం జెల్లీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీన్ని వాడడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఐతే పెట్రోలియం జెల్లీని కేవలం చర్మాన్ని తేమమయంగా ఉంచడం కోసమే కాకుండా ఇతరత్రా ఉపయోగాల కోసం కూడా వాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్రోలియం జెల్లీ... దాదాపు ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కనీసం ఇది 150 ఏళ్ల నుంచి మార్కెట్లో లభిస్తోంది. చర్మాన్ని తేమగా ఉంచేందుకు ఇది సహాయ పడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణం కారణంగా చర్మం పొడిబారిపోయినప్పుడు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చర్మంపై పెట్రోలియం జెల్లీని రాసుకున్నప్పుడు ఒక అవరోధం సృష్టించడం ద్వారా చర్మంలోని తేమను ఇది బంధిస్తుంది. అంతే కాదు పెట్రోలియం జెల్లీతో మరెన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. గాయాలు మానడంలో పెట్రోలియం జెల్లీ సహాయకారిగా ఉంటుంది. అలాగే పుండు అయిన చోట ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. మరోవైపు తామర, సోరియాసిస్ లాంటి సమస్యలు ఉన్న వారికి చక్కగా ఉపయోగపడుతుంది. పెట్రోలియం జెల్లీ రాసినప్పుడు తామర పొక్కుల్లోకి బ్యాక్టీరియా చేరకుండా నిరోధించడమే కాకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీని వల్ల తామర, సోరియాసిస్ లాంటి సమస్యల కోసం తీసుకునే మందులు చక్కగా పని చేసి త్వరగా నయం అయేందుకు అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో తామర లాంటి సమస్య ఉన్నా పెట్రోలియం జెల్లీని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఐతే శిశువు వయసు కనీసం 3 వారాలు దాటి ఉండాలి.
పెట్రోలియం జెల్లీని తలలో పేలను చంపడానికి ఉపయోగించవచ్చు. అంటే పేలను నివారించేందుకు దీన్నోక ఇంటి చిట్కాగా ప్రయోగించవచ్చు. ఇది పేలను మాత్రమే నివారిస్తుంది.. కానీ వాటి గుడ్లను పొదకుండా ఆపలేదు. అంటే మళ్లీ పేలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మరోవైపు చిన్న పిల్లలకు డైపర్స్ వాడినప్పుడు కొంత మందిలో చర్మంపై దద్దుర్లు రావడం చూస్తుంటాం. ఐతే పిల్లలకు డైపర్లు వేసే కంటే ముందుగా దద్దుర్లు వచ్చిన ప్రదేశాల్లో పెట్రోలియం జెల్లీని ఉపయోగించినట్లయితే క్రమంగా అవి తగ్గిపోతాయి. అలాగే చలిగాలుల బారి నుంచి చర్మాన్ని కాపాడేందుకు పెట్రోలియం జెల్లీ చక్కగా పని చేస్తుంది. ఐతే ఇలా రాసేటప్పుడు చర్మంపై మొటిమలు ఉన్న ప్రాంతాలను వదిలివేయాలి. మరోవైపు కొంత మందిలో జలుబు చేసినప్పుడు ముక్కు పొడిబారినట్లయితే.. కాస్త పెట్రోలియం జెల్లీ రాయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.
పెట్రోలియం జెల్లీ మనుషులకే కాదు పెంపుడు జంతువులకు కూడా ఉపయోగపడుతుంది. వాటి కాళ్ల కింద పెట్రోలియం జెల్లీ రాసినప్పుడు శీతాకాలంలో కాళ్లు సురక్షితంగా ఉంటాయి. అంతే కాదు వాటి చర్మాన్ని కూడా తేమగా ఉంచుతుంది. పెట్రోలియం జెల్లీ అనేది శిలాజ ఇంధనాల నుంచి తయారు చేసిన వస్తువు. దీన్ని వాడడం వల్ల సైడ్ అఫెక్టులు తక్కువగానే ఉన్నప్పటికీ కొంత మంది దీన్ని వాడేందుకు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు సహజసిద్ధంగా మొక్కల నుంచి తయారయ్యే నూనె ఉత్పత్తులను వాడుకుని శరీరాన్ని తేమగా ఉంచుకునేందుకు ప్రయత్నించవచ్చు.