కొలెస్ట్రాల్ అంటే ఏంటి? చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎలా?
కొలెస్ట్రాల్... దీని గురించి చాలా వింటూనే ఉంటాం. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ప్రమాదమని గుండెజబ్బులు వస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఇందులో నిజమెంత? అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కొలెస్ట్రాల్ శరీరానికి ప్రమాదమా? మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయా? ఏఏ ఆహార పదార్థాల నుంచి కొలెస్ట్రాల్ అందుతుంది? కొలెస్ట్రాల్ తగ్గించుకుంటేనే ఆరోగ్యమా? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ అంటే ఏంటి?
కొలెస్ట్రాల్.. ఈ పదం వినగానే చాలా మంది భయపడిపోతారు. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె జబ్బులు వస్తాయని ఓ గుడ్డి నమ్మకం ప్రచారంలో ఉంది. ఇందులో కొంత మేరకు నిజం ఉన్నప్పటికీ.. పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే.. కొలెస్ట్రాల్ అనే విషయంపై పూర్తిగా అవగాహన లేకపోవడమే దీనికి కారణం. రక్తంలో ఉండే కొవ్వునే కొలెస్ట్రాల్ అని వ్యవహరిస్తారు. నిజానికి దీన్ని మన శరీరమే కొంత మేరకు తయారు చేసుకుంటుంది. మరికొంత అదనంగా ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. అంటే ఆహార పదార్థాల్లో శ్యాచురేటేడ్ ఫ్యాట్ కలిగిన వాటిని మోతాదుకు మించి తీసుకున్నప్పుడు రక్తంలో కొవ్వు పేరుకుపోతుంది. కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొలెస్ట్రార్, చెడు కొలెస్ట్రాల్. అంటే రక్తంలో తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ను.. LDLఅని.. ఎక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ను HDL అని పిలుస్తారు. LDL అనేది చెడు కొలెస్ట్రాల్. ఇది రక్తంలో ఎక్కువగా పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు పూడుకుపోయి గుండె సమస్యలు వస్తాయి. ఇక HDL.. అనేది మంచి కొలెస్ట్రాల్. శరీరం విటమిన్ D తయారు చేసుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలు ఏవి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. ఇందుకోసం ఆహార పదార్థాలు, జీవన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే శ్యాచురేటెడ్ ఫ్యాట్ (సంతృప్త కొవ్వు) ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే అసంతృప్త కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా మెనూలో చేర్చుకోవాలి. ఓట్స్, బార్లీ, ముడి ధాన్యాలు, బీన్స్, యాపిల్, గ్రేప్స్, స్ట్రా బెర్రీస్, సిట్రస్ జాతికి చెందిన కమలా, బత్తాయి పండ్లు, సోయా, సోయా ఆధారిత ఉత్పత్తులు, సాల్మన్, టునా, సార్డిన్స్ రకాల చేపల్లో శరీరానికి హాని చేసే కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మెనూలో చేర్చుకోవాలి. అలాగే నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంండాలి.
ఆహార పదార్థాలతోపాటు జీవన విధానంలోనూ మార్పులు .. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకోవాలి. దీని వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అంతే కాకుండా అధిక రక్తపోటు, టైప్ 2 డయాబేటీస్ సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు స్థూలకాయాన్ని తగ్గించుకునే ప్రయత్నించాలి. ముఖ్యంగా నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
Read: టమాటోతో కలిగే ఆరోగ్యప్రయోజనాలేవి?
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతే కాకుండా ఆరోగ్యకరమైన బరువు సొంతమవుతుంది. అలాగే ఉదయం పూట రోజూ నడిచే వారిలో గుండెపోటు సమస్యలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు రోజూ ధ్యానం, యోగా లాంటివి చేయడం వల్ల కూడా మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు.
Read Also: పైనాపిల్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా?
కొలెస్ట్రాల్ గురించి ఎవరైనా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మంచి కొలెస్ట్రాల్ శరీరానికి ఎంత ముఖ్యమో.. శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరం. కాబట్టి.. చెడు కొలెస్ట్రాల్ తయారు కాకుండా ఆహారం, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించేందుకు అవసరమైన వ్యాయామం లాంటి విధానాలు అలవాటు చేసుకోవడం మంచిది. దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు.
Read: ఇయర్ ఫోన్స్ చెవులకు చేటు చేస్తాయా?