దేశంలో కొత్త పార్టీ వస్తే తప్పేంటి?: కేసీఆర్
తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికంగా కురుస్తున్న వర్షాలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశ ప్రగతికి బీజేపీ ప్రతిబంధకంగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశంలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని ఎందుకు తీసుకురావడం లేదన్నారు. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఎజెండాను త్వరలోనే వెల్లడిస్తామన్నారు కేసీఆర్.
దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ ధరను విపరీతంగా పెంచింది మోదీ సర్కారు కాదా అని ప్రశ్నించారు. ఏక్ నాథ్ షిండే లాంటి వ్యక్తులతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పడంపైనా కేసీఆర్ స్పందించారు. దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును పడగొట్టాలని సవాల్ విసిరారు.
Watch Live: CM Sri KCR addressing the media from Pragathi Bhavan https://t.co/Nb7TVH3EXH
— Telangana CMO (@TelanganaCMO) July 10, 2022